పనిలో శ్రద్ధ | Telugu Christian Illustrations
పనిలో శ్రద్ధ
చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనియైనను నీ శక్తి
లోపము లేకుండ చేయుము (గలతీ 9:10).
మనము మేలు చేయుటయందు విసుగక యుందము. మనము అలయక
మేలు చేసితిమేయని తగిన కాలమందు
పంట కోతుము (గలతీ 6:9).
సుమతికి 55 సంవత్సరములు. తన ఇంటికి రెండు మైళ్ళ దూరంలో
ఉన్న చర్చికి నడిచి వెళ్లి
అక్కడ ఉన్న పిల్లలకు సండే స్కూల్ నడిపించేది. ఒక రోజు ఆదివారము ఉదయమే వర్షము
కురియుట ప్రారంభమైనది. ఈ వర్షంలో సండేస్కూల్కు ఎవరు వస్తారు? అని వెళ్లడం మానివేసింది. పది నిమిషములు గడిచిన
తరువాత ఒక వేళ ఎవరైనా వస్తే నేను అక్కడ లేనని
నిరాశపడతారేమో అని లేని ఓపికను తెచ్చుకొని గొడుగు తీసుకొని మెల్లగా ఆ వర్షంలో రెండు మైళ్ళు నడుచుకొంటూ
చర్చికి చేరింది.
ఆ రోజు పాల్సన్ అనే ఒకే ఒక అబ్బాయి సండే
స్కూల్కు వచ్చాడు. అతనికి బైబిల్ కథ చెప్పినది. ఆ అబ్బాయి మరలా
ఎప్పుడు సండే స్కూల్కు రాలేదు. సుమతి తన శ్రమంతా వృధా
అయినదని అనుకొంటూ ఉండేది.
కొన్ని సంవత్సరముల తరువాత సుమతికి ఒక ఉత్తరము
వచ్చింది. మిలటరీలో ఉన్న ఒక సైనికుడు ఆమెకు ఆ ఉత్తరము వ్రాసాడు. తాను వర్షము
వచ్చిన రోజున సండే స్కూల్కు వచ్చిన
పాల్సన్ను అని పరిచయము చేసుకొన్నాడు.
తాను సండే స్కూల్కు రాకపోయినా మీరు నిజంగా సండే
స్కూల్ విద్యార్థుల పట్ల శ్రద్ధ కలిగి
ఉన్నారా? అని
పరిశీలించుటకు తాను వర్షము కురిసిన రోజు సండే స్కూల్కు వచ్చానని తెలియజేసాడు. ఒక్కడే విద్యార్థి ఉన్నా
క్లాస్ అంతటికీ బోధించినంత శ్రద్ధగా తనకు
బోధించినందుకు తాను ఎంతో ఆశ్చర్యపోయాననీ, అందువల్ల తాను క్రీస్తును రక్షకునిగా
అంగీకరించానని తెలియజేసాడు. ప్రస్తుతము యుద్ధములో గాయపడి మరణించే స్థితిలో ఉన్నా తనకు మరణము అంటే భయము లేదనీ,
ఒక రోజు అమెను పరలోకంలో కలుసు కొంటానని వ్రాసాడు. ప్రభువు గురించి మనము
పడిన శ్రమ ఏదియూ వృధా కాదు.
ప్రభువు వలన స్వాస్థ్యముగా ప్రతిఫలముగా
పొందుదుమని ఎరుగుదురు గనుక, మీరేమి చేసినను
అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులైయున్నారు
(కొలొస్స 3:23).
– డాII పి. బి. మనోహర్
Comments
Post a Comment