ఆయనే చెప్పారు! | Telugu Christian Illustrations
ఆయనే చెప్పారు!
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన
అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు
విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు అయనను అనుగ్రహించెను (యోహాను 3:16).
నెపోలియన్ తన గుర్రమును అధిరోహించి సైన్యమును
పరిశీలిస్తున్నాడు. అకస్మాత్తుగా అయన గుర్రము
బెదిరి వెనుక కాళ్ళ మీదకు లేచింది. నెపోలియన్ చేతిలోని కళ్ళెము జారిపోయినది. గుర్రము పరుగు తీయుట
ప్రారంభించింది. నెపోలియన్ పరిస్థితి చాల ప్రమాదంగా
ఉన్నది. ఒక సైనికుడు అది చూచాడు.
అతడు వేగంగా పరుగెత్తి గుర్రపు కళ్ళెము
పట్టుకొని గుర్రము ఆపాడు. అది చాల ప్రమాదముతో
కూడుకొన్న పని. గుర్రము అతనిని త్రొక్కవచ్చును. అయినా అతడు తెగించి గుర్రమును ఆపాడు. నెపోలియన్ సంతోషించి
"ఈ రోజు నుండి నిన్ను శతాధిపతిని చేస్తున్నాను"
అన్నాడు.
అ సైనికుడు వెంటనే నెపోలియన్కు సెల్యూట్ చేసి
శతాధిపతులు కూర్చుండే స్థలమునకు
వెళ్లాడు. అతని దళపతి "శతాధిపతులు కూర్చుండే చోటికి నీవు ఎందుకు వెళుతున్నావు? దళపతినైన నాకే అక్కడికి వెళ్లే అధికారము లేదు.
నీవు వచ్చి ఇక్కడ లైనులో
నిలబడు" అని అరిచాడు. ఆ సైనికుడు "నేను అక్కడికి వెళ్లను" అన్నాడు.
దళపతికి కోపము వచ్చింది. "ఎందుకు వెళ్లవు?"
అని గద్దించాడు. ఆ
సైనికుడు "నేను
శతాధిపతిని" అన్నాడు. అప్పుడు దళపతి “దళపతిగా 5 సంవత్సరముల నుండి పని చేస్తున్న నాకే శతాధిపతి అయ్యే అవకాశము
రాలేదు. నీవు శతాధిపతివి ఎలా అవ్వగలవు?"
అని కోపంగా అడిగాడు. ఆ
సైనికుడు నెపోలియన్ను చూపిస్తూ “ఆయనే చెప్పారు"
అన్నాడు.
దళపతి ఇక ఏమీ మాట్లాడలేక పోయాడు. సాక్షాత్తు
నెపోలియన్ చెబితే ఎవరు కాదనగలరు?
అలాగే ప్రభువు మనతో
చెబితే అది అభయవాక్కే "యేసు ప్రభువునందు విశ్వాసముంచు వారు నశింపక నిత్యజీవము
పొందునట్లు ఆయనను అనుగ్రహించెను" అను మాటను మనము
విశ్వసించిన యెడల మనము నిత్యజీవము అందు కొనగలము. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తియ్యక
మనందరికొరకు ఆయనను అప్పగించిన వాడు
ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ( రోమా 8:32).
– డాII పి. బి. మనోహర్
Comments
Post a Comment