ఆత్మల పట్ల భారము | Telugu Christian Illustrations
ఆత్మల పట్ల భారము
నేను సువార్తను
ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడియున్నది.
అయ్యో నేను సువార్తను ప్రకటింపక "పోయిన యెడల
నాకు శ్రమ (1కొరింథీ 9:16).
ఫెడ్రిక్ గారు 1867లో మన దేశంలో సువార్త ప్రకటించుటకు ఇంగ్లాండ్ నుండి వచ్చారు. ఆరోగ్యము క్షీణించినందువల్ల విశ్రాంతి కొరకు తిరిగి ఇంగ్లాండ్ వెళ్లారు. ఎడిన్బరోలో జూన్ మాసంలో ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడుటకు ఆయనను ఆహ్వానించారు. ఎంతో అనారోగ్యముగా ఉన్ననూ ఆయన ఓపిక తెచ్చుకొని ఆ సభకు హాజరయ్యారు. తన గురించి, తన సేవ గురించి క్లుప్తంగా మాట్లాడి భారత దేశంలో సువార్త అవశ్యకత గురించి అక్కడ ఉన్న పాస్టర్లకు వివరించి తమ సంఘముల నుండి మిషనెరీలను పంపవలసినదని విజ్ఞప్తి చేసారు. ఆయన ఇంకా మాట్లాడు చుండగానే నీరసము వలన స్పృహతప్పి పడిపోయారు.
ఆయన స్నేహితులు
ఆయనను ఆసుపత్రికి తీసుకొని వెళ్లి వైద్యము చేయించారు. అయన స్పృహలోనికి రాగానే "నేను ఎక్కడ
ఉన్నాను?" అని అడిగారు. ఆయన స్నేహితులు "నీవు మాట్లాడు చుండగా నీరసము వలన
స్పృహతప్పి పడిపోయావు. అందువలన డాక్టర్ వద్దకు
తీసుకొని వచ్చాము" అని చెప్పారు. వెంటనే ఆయన "అవును నాకు జ్ఞాపకము వచ్చింది. నేను భారత దేశమునకు సేవకులు
కావాలని మనవి చేస్తున్నాను. నా ప్రసంగము
పూర్తి కాలేదు. నన్ను వెంటనే స్టేజ్ మీదకు తీసుకొని వెళ్లండి" అన్నారు.
డాక్టర్
"ఫెడ్రిక్ గారూ! మీరు ఇప్పుడు ప్రసంగించే స్థితిలో లేరు. మీరు మరలా నిలబడి మాట్లాడితే మరణము సంభవింప వచ్చును"
అన్నాడు. ఫెడ్రిక్ గారు వెంటనే "నేను నా
ప్రసంగం పూర్తి చేయకపోతేనే చస్తాను" అని చెప్పారు. ఆయన మాట కాదనలేక మరలా ఫెడ్రిక్ గారిని స్టేజ్ మీదకు తీసుకొని
వెళ్లారు.
వణుకుచున్న స్వరంతో "స్కాట్లాండ్ ప్రజలారా! నేను 25 సంవత్సరాలు భారత దేశంలో సువార్త ప్రకటించి వచ్చాను. నా ఆరోగ్యము క్షీణించింది. ఇప్పుడు అనారోగ్యముతో స్కాట్లాండ్కు తిరిగి వచ్చాను. మీ సంఘముల నుండి యౌవనస్తులు భారత దేశమునకు మిషనెరీలుగా పంపకపోతే రేపే నేను సామానులు సర్దుకొని భారత దేశమునకు వెళతాను. యేసును యెరుగకుండా వారు మరణించుట నాకు ఇష్టము లేదు. వారి కోసము నేను బ్రతుకక పోయినా మరణించుటకు సిద్ధముగా ఉన్నాను" అన్నారు.
ఆయన ప్రసంగమునకు
ఉత్తేజితులైన అనేక మంది భారత దేశమునకు మిషనెరీలుగా వచ్చారు. నేడు మనకు అట్టి బాధ్యత ఆత్మల పట్ల
భారము ఉన్నదా? అనేక మంది ఇంకను యేసు ప్రభువును ఎరుగకుండా ఉండగా మనయు ఇతర
విషయములందు శ్రద్ధ కలిగి యున్నాము.
ఆస్తులను సంపాదించుకొనుట యందు ఆశక్తి కలిగి యున్నాయు. పేరు ప్రతిష్టలను సంపాదించుకొనుట యందు మన
దృష్టి నిలుపు చున్నాము. ఫెడ్రిక్ గారికి ఉన్నట్లు
ఆత్మల పట్ల భారము కలిగి యుందము. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని యెరిగి, స్థిరులును కదలని వారును, ప్రభువు కార్యాభివృద్ధియందు యెప్పటికిని ఆసక్తులునై యుండుడి (1కొరింథీ
15:58).
– డాII పి. బి. మనోహర్
Comments
Post a Comment